ముషీరాబాద్, వెలుగు: చదువుతోనే సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్ హాస్టల్స్ కంటే ప్రభుత్వ హాస్టల్స్ చాలా బాగున్నాయని.. సీఎం రేవంత్ కూడా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. సోమవారం ఆయన విద్యానగర్ బీసీ భవన్‌లో 'ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు పిల్లల్ని పంపించండి' అనే పోస్టర్‌ను తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పైసా ఖర్చు లేకుండా 3వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకునే అవకాశం ఉందన్నారు. సుమారు 8 లక్షల మందికి ఉచిత భోజన, బోధన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించి వసతులను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
